సాహసాలే విజయ సోపానాలు

0

ramanaidu‘నిర్మాత తల్లిలాంటివాడు…’ అంటారు.
అందరికీ అన్నం పెట్టే చేయి.. అందరి బాగు కోరుకొనే మనసు నిర్మాతకే ఉంటుంది. అలాంటప్పుడు 24 విభాగాల్లో నిర్మాతకు పెద్ద ‘పీట’ వేయాల్సిందే. కానీ అలా జరగడం లేదు. కెప్టెన్ ‘కుర్చీ’ దర్శకుడికి.. కేర్ వ్యాన్ హీరో హీరోయిన్లకు ఇచ్చేసి – నిర్మాత మాత్రం నడిరోడ్డు మీద నిలబడిపోతున్నాడు. అదీ.. ఇప్పటి నిర్మాత పరిస్థితి.

నిర్మాతంటే అర్థం మారిపోయిందిప్పుడు. పెట్టుబడి – లాభం మధ్య వూగిసలాడేవాడే నిర్మాత. సినిమా హిట్టయితే పేరు, పరపతి కథానాయకుడికీ, దర్శకుడికీ. ఫ్లాప్ అయితే.. ఆ నష్టం నిర్మాతకి. నిర్మాతంటే ఓ క్యాషియర్. ఇంకా మాట్లాడితే… ఓ గుమస్తా!

ఇలాంటి పరిస్థితుల్లోనూ కొంతమంది నిర్మాతల్ని చూస్తే

గుండెల నిండా విశ్వాసం కలుగుతుంది. ఆ స్థానంపై గౌరవం

కలుగుతుంది. నిర్మాత అంటే క్యాషియర్ కాదు నిజమైన

ఫిల్మ్‌మేకర్ అంటూ సవరించి రాసుకోవాలనిపిస్తుంది. అలాంటి నిర్మాత డా|| డి.రామానాయుడు.

నిర్మాతగా ఆయనది 50 ఏళ్ల ప్రయాణం. ఆయన చూడని మలుపు లేదు. దక్కని గెలుపు లేదు. ఆటుపోట్లు ఎదురైనా సరే.. సినిమాపై

‘పిచ్చి ప్రేమ’ మాత్రం పోలేదు.

‘రిస్క్’… ఈ పదం చుట్టూ రామానాయుడు సినీ జీవితం చక్కర్లు కొట్టింది.

‘ఈ సినిమాతో తాడే పేడో తేల్చుకోవాలి..’ అని రంగంలోకి దిగిన సందర్భాలు కోకొల్లలు. విశేషమేమిటంటే.. అలా అనుకొన్న ప్రతిసారి ఆయన్ని గెలుపు వరించింది. ‘రాముడు – భీముడు’ ఆయనకు తొలి సవాల్. అప్పటి వరకూ స్నేహితులతో కలసి సినిమాలు తీసేవారు. వరుస పరాజయాలు భరించలేక ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. రామానాయుడు ఒక్కరే మిగిలారు. సోలో నిర్మాతగా ‘రాముడు – భీముడు’ పట్టాలెక్కించారు. ‘ఈ సినిమా ఆడితే మద్రాస్‌లో ఉంటా. లేదంటే మహాబలిపురం వెళ్లి వ్యవసాయం చేసుకొంటా..’ అని శపథం పూనారాయన. ఆయన కార్యదక్షతకు విజయం సైతం తలవొంచింది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భవిష్యత్తులో సాధించబోయే విజయాలకు ‘రాముడు భీముడు’ రాచబాట వేసింది. ‘ప్రేమ్‌నగర్’ తీసేటప్పుడూ దాదాపు ఇలాంటి పరిస్థితే. అప్పటికి సురేష్ ప్రొడక్షన్స్ నష్టాల్లో ఉంది. ‘ఇది చాలా రిస్కీ కథ. సినిమా పోతే అంతే సంగతులు. వద్దులెండి..’ అంటూ స్నేహితులు, సన్నిహితులూ వారించారు. కానీ రామానాయుడు వినలేదు. ‘పోయిన చోటే వెదుక్కొంటా. విజయమో, వీర స్వర్గమో..’ అంటూ మొండి ధైర్యంతో ముందడుగు వేశారు. ఫలితం ఓ సూపర్‌హిట్!! ‘కలియుగ పాండవులు’ కథ కృష్ణ కోసం రాసుకొన్నది. కానీ.. ‘నాకు ఖాళీ లేదు’ అన్నారాయన. ‘కృష్ణ వద్దంటే సినిమా ఆపలేం కదా..’ అని పట్టుదల పెరిగి, విదేశాల్లో చదువుకొంటున్న వెంకటేష్‌ని హుటాహుటిన తీసుకొచ్చారు. ‘ఈ సినిమాలో నువ్వే హీరో..’ అన్నారు. అలా తెలుగు చిత్రసీమకు వెంకటేష్ పరిచయం అయ్యారు.

కొత్త దర్శకుల్ని పరిచయం చేయడంలో రామానాయుడు ఎప్పుడూ ముందుంటారు. 21 మంది దర్శకుల్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. ‘నా సినిమా అంటే అన్ని విషయాల్లోనూ నేను జోక్యం చేసుకొంటా. నాకు తెలియకుండా ఒక్క డైలాగ్ కూడా చేర్చడానికి వీల్లేదు..’ అంటుంటారు రామానాయుడు. ”సినిమా నాకు ప్యాషన్ కాదు. ఇది నా జీవితం.. అందుకే ప్రతి నిమిషం సినిమాలతోనే మమేకం అవుతా” అని చెబుతుంటారాయన. స్క్రిప్టుని కంఠతా పట్టగల ఒకే ఒక్క నిర్మాత… రామానాయుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. షూటింగ్ మొదలెట్టిన దగ్గర్నుంచి, పేకప్ చెప్పేవరకూ సెట్లోనే ఉంటారాయన. నిర్మాణానంతర కార్యక్రమాల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ”నాన్నగారిని ఎప్పుడు చూసినా ఏదో ఒక స్క్రిప్టు చదువుతూ కనిపిస్తారు. ఈ వయసులో ఆయన ఉత్సాహం చూస్తే నాక్కూడా అబ్బురమనిపిస్తుంది” అంటుంటారు చిన్నబ్బాయి వెంకటేష్.

రూపాయి నోటుపై ఉన్న అన్ని భాషల్లోనూ సినిమాలు తీసిన నిర్మాతగా ఆయన గిన్నీస్ బుక్ ఎక్కారు. శతాధిక చిత్రాల నిర్మాతగా పేరుగడించారు. అయినా సినిమాలపై ఇంకా చెక్కుచెదరని ప్రేమాభిమానాలు. ‘నాకు తెలిసినంత వరకూ ఇల్లూ, సెట్టూ రెండూ ఒక్కటే. రెండు చోట్లా నా కుటుంబ సభ్యులే ఉన్నారు..’ అని చెప్పుకొనేంత విశాల హృదయం ఆయనది. దర్శకత్వం వహించాలన్నది ఆయనకు మిగిలిన ఒకే ఒక కల. అది త్వరలోనే తీరాలని ఆశిస్తూ..

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts